చంటిగాడి రివ్యూ : సరైనోడు

sarrainodu-telugu-review-cced6a19.jpg

చంటిగాడి రివ్యూ : సరైనోడు 

వెండితెర పోటుగాళ్ళు : అల్లు అర్జున్, రాకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రేస, ఆది పినిశెట్టి..   
బాజా భజంత్రీల మోతగాడు : ఎస్ఎస్ తమన్   
కాసు దుడ్డు పైసా మనీ మనీ : అల్లు అరవింద్    
స్టార్ట్, కెమెరా, యాక్షన్, కట్, షాట్ ఓకే : బోయపాటి శ్రీను     
థియేటర్ కి వచ్చిన తేదీ : 2016 - ఏప్రిల్ - 22 

కథ : 

అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కొడుకే మన సరైనోడుని ఢీ కొట్టే విలన్ వైరం ధనుష్ రెడ్డి(ఆది పినిశెట్టి). ఒక అమ్మాయిని అతిదారుణంగా రేప్ చేసి చంపేసిన కేసులో ఆది తన మిత్రుడు ఆదర్శ్ ని కాపాడతాడు. వైరం ధనుష్ రెడ్డికి ఆదర్శ్ తో పర్ణశాల అనే ఊరిలో ఒక పని చేయించాల్సి ఉంటుంది, అందుకే అతన్ని కాపాడతాడు. కానీ ఎమ్మెల్యే అయిన హన్సిత రెడ్డి(కేథరిన్ ట్రేస) ఆదర్శ్ కి షిక పదాలని పోరాడుతూ ఉంటుంది. కట్ చేస్తే మన హీరో ఘన (అల్లు అర్జున్).. ఎలాంటి పనీ పాట లేకుండా తిరుగుతూ.. కచ్చితంగా రోజుకు రెండు గొడవల్లో అయినా తల దూర్చి ఎవడినో ఒకడిని ఇరగదీయందే మన ఘనకి నిద్ర పట్టదు. అలాంటి ఘన మొదటి చూపులోనే హన్సిత రెడ్డికి కనెక్ట్ అయిపోతాడు. కట్ చేస్తే ఎలక్షన్స్ టైంలో చేసిన వాగ్దానంలోని కొన్ని వాఖ్యాలకి కనెక్ట్ చేసి ఏదో మాయ చేసి హన్సిత రెడ్డికి దగ్గరవుతాడు. ఫైనల్ గా వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్ళికి సిద్దం అయినప్పుడు హన్సిత రెడ్డి ఒక కండిషన్ పెడుతుంది. అదే తను ఇక గొడవలకి వెళ్ళకూడదు అని, అదే టైంలో వైరం ధనుష్ రెడ్డి ఘనకి పరిచయం ఉన్న జాను(రకుల్ ప్రీత్ సింగ్)ని తన కళ్ళ ముందు చంపాలని ప్రయత్నిస్తుంటాడు. దాంతో ఘన హన్సిత రెడ్డి మాటని పక్కన పెట్టి  వైరం ధనుష్ రెడ్డిని ఢీ కొట్టాల్సి వస్తుంది. ఇక అక్కడి నుంచి వారిద్దరి మధ్య జరిగిన పోరు ఏంటి? అసలు వైరం ధనుష్ రెడ్డి జానుని ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు ఘన - జానుల కథ ఏంటి? ఫైనల్ గా వైరం ధనుష్ రెడ్డిపై ఘన గెలిచాడా? లేదా? చివరికి ఇద్దరిలో ఏ భామతో ఘన సెట్ అయ్యాడు అన్నదే కథ..        

తారామణుల నటనా చాతుర్యం : 

ఈ సినిమాకి సరైనోడు అల్లు అర్జున్ కాబట్టి మొదటగా అతని నటన ఈ సినిమాలో ఏ రేంజ్ లో ఉందనేది చెబుతా .. అల్లు అర్జున్ కి లైన్ స్టైలిష్ స్టార్.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి మరోసారి ఆ ట్యాగ్ లైన్ కి సార్ధకత చేసాడు. కానీ మాస్.. ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ ని ఇది వరకూ ఇలా చూడలేదు, ఇకపై చూస్తాం అని కూడా ఆశించలేం. ఈ మాస్ పాత్ర కోసం బన్ని ప్రాణం పెట్టి పని చేసాడని చెప్పాలి. బన్నినే ఈ సినిమాకి ఆయువు పట్టు. ఈ సినిమాకి ఉన్న మెయిన్ పిల్లర్స్ రెండు అయితే అందులో ఒకటిబన్ని, రెండవది ఆది పినిశెట్టి. ఆది ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్లో వావ్ అనిపించాడు. బన్ని - ఆది లేకుండా ఈ సినిమాని ఊహించుకోలేం. ఇక వీరి తర్వాత సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ గా నిలిచిన వారు రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్. వీరిద్దరికీ చెప్పుకోదగ్గ పాత్రలు రాయలేదు, ఉన్న పాత్రలో బాగానే చేసారు. అలాగే గ్లామర్ పార్ట్ లో ఆకట్టుకున్నారు. మిగతా పాత్రల్లో ఒకే ఒక్క సీన్ చేసినా హైలైట్ అనిపించుకుంది రాజీవ్ కనకాల. కోర్టు సీన్ లో లాయర్ గా రాజీవ్ కనకాల నటన మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఇకపోతే శ్రీకాంత్ కూడా తన పాత్రలో మెప్పించాడు. సాయి కుమార్, విజయ్ కుమార్, జయప్రకాశ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు తమ పాత్రలమేర నటించి మెప్పించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ లో అందరినీ ఉర్రూతలూగించింది. సెకండాఫ్ లో ఇదొక స్పెషల్ హైలైట్ గా చెప్పుకోవచ్చు.   

సాంకేతిక నిపుణుల ప్రతిభ :
సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ అందించిన సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. మొదటి సీన్ నుంచి ప్రతి విజువల్ మిమ్మల్ని చూపు తిప్పుకోనివ్వదు. అలాగే నటీనటులందరినీ ది బెస్ట్ అనేలా ప్రెజంట్ చేసారు. సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే సింప్లీ సూపర్బ్. మూవీ టాప్ హైలైట్స్ లో సినిమాటోగ్రఫీ ఒకటి. 

సంగీతం : ఎస్ఎస్ తమన్ అందించిన పాటలు విన్నప్పుడు ఒక మోస్తరు హిట్స్ అయితే, లావిష్ పిక్చరైజేషన్ వలన ఆన్ స్క్రీన్ ఇంకా బాగా అనిపిస్తాయి. ఇక నేపధ్య సంగీతం సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్ మరియు సెకండాఫ్ లోని యాక్షన్ ఎపిసోడ్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కెవ్వు కేక..   

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కథ పెద్దగా చెప్పకపోవడం వలన అక్కడక్కడా డ్రాప్స్, సాగాదీత ఉండడం వలన కాస్త బోరింగ్. సెకండాఫ్ లో కథ మొత్తం రన్ అవ్వడం, ఫుల్ యాక్షన్ ప్యాక్ తో ఉండడం వలన ఫాస్ట్ గా సాగిపోతున్నట్టు ఉంటుంది.  

నిర్మాణం :.గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి అల్లు అరవింద్ మరోసారి ఉన్నతమైన సాకేంతిక విలువలు కలిగిన హాయ్ క్వాలిటీ పిక్చర్ ని అందించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించడం వలనే స్క్రీన్ పై అవుట్ పుట్ చాలా బాగుంది. 

కథ - కథనం - దర్శకత్వం : 
బోయపాటి తన రెగ్యులర్ పంథాలోనే కథని తీసుకున్నాడు.. చాలా పాత కథని తీసుకొని దానికి పాత్రలతో కొత్తదనాన్ని తీసుకు వచ్చాడు. పాత్రలను రాసుకోవడం వరకూ బాగానే రాసుకున్నా ఈ సారి వాటిని ఎలివేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడంలో బోయపాటి కాస్త తడబడ్డాడు అని చెప్పాలి. బోయపాటి మార్క్ - అల్లు అర్జున్ మార్క్ ఇలా రెండింటిని మిక్స్ చేసి ఒక ఫార్మాట్ అనుకున్నారు. అదే వర్కౌట్ అవ్వలేదు. ఎలా అంటే.. ఇద్దరిదీ మిక్స్ చేయాలి అనుకోవడం వలన అవుట్ పుట్ లో అటు అల్లు అర్జున్ మార్క్ పూర్తిగా లేదు, ఇటు బోయపాటి శ్రీను మార్క్ పూర్తిగా లేదు... ఎక్కడో ఓ చోట మాత్రమే అవి కనిపిస్తాయి.. మిగతా అంటే ఎవరి మార్కో కనిపిస్తుంటుంది. ఇలా కథ పరంగానే కాకుండా స్క్రీన్ ప్లే పరంగా కూడా అలేన్గ్త్ ఎక్కువ తీసేసుకొని తప్పు చేసారు. అలాగే స్క్రీన్ ప్లే లో చాలా వరకూ లెజెండ్ సినిమా ఫార్మాట్ కనిపిస్తుంది. ఇకపోతే డైరెక్టర్ గా ఎప్పుడు మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ని బాగా రాసుకొని దానిని ఎమోషనల్ లింక్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ చేయడం వలన బోయపాటి సక్సెస్ అవుతున్నారు.. కానీ ఇందులో సీన్స్ ఉన్నాయి, కానీ ఎమోషనల్ గా కనెక్టివిటీ లేదు.. ఫైట్ లో ఊర మాస్ అనుకునే కంటెంట్ ఉంది కానీ అంతలా ఆన్ స్క్రీన్ ఎలివేట్ అవ్వలేదు. ఓవరాల్ గా బోయపాటి శ్రీను స్టైలిష్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ ని తీసుకోవడం వలన ఎక్కడో చిన్న తడబాటు కనిపిస్తుంది.  

సినిమాలో కూర్చోబెట్టేవి :
- అల్లు అర్జున్ పవర్ ప్యాక్ పెర్ఫార్మన్స్ 
- బోయపాటి శ్రీను ఊర మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ హీరోయిజం ఎలివేషన్ 
- ఆది పినిశెట్టి పవర్ఫుల్ యాక్షన్ 
- రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ 
- తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 

సినిమాలో టార్చర్ చేసేవి : 
- రొటీన్ అనిపించే కామెడీ 
- ఫస్ట్ హాఫ్ లో కథ చెప్పకుండా సాగదీయడం 
- సెకండాఫ్ బాగా రెగ్యులర్ గా ఉండడం
- కనెక్ట్ కాని ఎమోషనల్ ట్రీట్ మెంట్ 
- ఓల్డ్ స్టొరీ విత్ వీక్ స్క్రీన్ ప్లే  

విశ్లేషణ : 

వేరు వేరు ఇమేజ్ కలిగిన హీరో - డైరెక్టర్ కలిసినప్పుడు వారి నుంచి వచ్చే సినిమా సర్ప్రైజింగ్ గా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు లేదా ఫ్లాప్. కానీ ఈ సినిమా మాత్రం మధ్యస్థంగా నిలిచిపోయింది. ఈ సినిమా పరంగా అల్లు అర్జున్ అన్నా పూర్తిగా బోయపాటి శ్రీను మార్క్ లోకి వెళ్లి చేసున్డాలి, లేదా బోయపాటి అన్నా అల్లు అర్జున్ దారిలోకి వెళ్లి చేసున్డాలి. కానీ అది సగం, ఇది సగం మిక్స్ చేసి చేయడం వలన సినిమా కూడా అటు ఇటు గా వచ్చింది. కొన్ని పేలాయి, కొన్ని పేలలేదు. సినిమా మొదటి 40 నిమిషాలు పాత్రల పరిచయాలతో కొన్ని సీన్స్ ఎలివేశంస్ తో బాగానే సాగుతుంది. ఆ తర్వాత బాగా రొటీన్ బోరింగ్  ఫార్మాట్ లోకి వెళ్లి ఏదో కామెడీ చేసారు. ఫైనల్ గా మళ్ళీ ఇంటర్వల్ బ్లాక్ ని ఎలివేట్ చేసి సెకండాఫ్ పై హిప్స్ ని క్రియేట్ చేసారు. కానీ సెకండాఫ్ లో అనుకున్న స్థాయిలో హైప్ ని రీచ్ కాలేకపోవడం సినిమాకి మైనస్. ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యే పాయింట్స్ బాగా రాసుకొని ఇక ఆడియన్స్ కమాన్ అని ఊపులో ఉన్నప్పుడు టేకింగ్ లో చాలా వరకూ నీరు కార్చేసాడు. దాంతో మందు చేసిన బిల్డప్ అంతా వృధా అయ్యింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నా కనెక్ట్ అయ్యి ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేవి మాత్రం చాలా తక్కువ ఉండడం బాధాకరం. ఓవరాల్ గా అల్లు అర్జున్ ఇమేజ్ పరంగా చూసే వారికి ఈ సినిమా పెద్దగా నచ్చాడు, మాస్ మసాలా కోరుకునే ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాకి భీభత్సంగా హెల్ప్ అయ్యే పాయింట్.. గత కొద్ది రోజులుగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమా లేకపోవడం వలన, సమ్మర్ సీజన్ కావడం వలన, మరో రెండు వారాలు వేరే పెద్ద సినిమాలు లేకపోవడం వలన మరియు సినిమాకి యావరేజ్ టు హిట్ టాక్ ఉండడం వలన ఈ సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్ వస్తాయి. బి, సి సెంటర్స్ లో ఎక్కువగా కాసుల వర్షం కురుస్తుంది. ఫైనల్ మాటగా.. సరైనోడు సినిమా యావరేజ్ గా ఉంది కానీ అదృష్టం కలిసిరావడం వలన కలెక్షన్స్ పరంగా సరైనోడు హిట్టు బొమ్మ అవుతుంది.       

పవర్ పంచ్ : 

అదృష్టం కలిసొస్తే అడుక్కుతినే వాడు కూడా అంబానీ అవుతాడట.. అలాగే సమయం, సందర్భం కలిసివస్తే యావరేజ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందట. అదే అదృష్టమే ఇప్పుడు సరైనోడు సినిమాకి కలిసివచ్చింది. సరైనోడు సినిమా కంటెంట్ పరంగా యావరేజ్ బొమ్మ, కానీ మాస్ కి కావాల్సిన అంశాలు, సీజన్, వేరే సినిమా అనేది లేకపోవడం లాంటివి సరైనోడు సినిమాని హిట్ నుంచి సూపర్ హిట్ అనే స్థాయికి తీసుకెళ్ళే అవకాశం ఉంది.
 
చూడాలా వద్దా : ఊర మాస్ మూవీ లవర్స్ వెళ్లి చూడండి.    
బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ రేంజ్ : హిట్..
కొస మెరుపు : సరైనోడు - అల్లు అర్జున్ కి మరో సీజన్ హిట్..  
చంటిగాడి రేటింగ్ : 2.5/5

ఇట్లు మీ చంటిగాడు - ఓ తెలుగు సినిమా అభిమాని

<< చంటిగాడి రివ్యూ : రాజా చెయ్యి వేస్తే >> చంటిగాడి రివ్యూ : పోలీస్
Interviews

More

Events

More