చంటిగాడి రివ్యూ : ఈడోరకం ఆడోరకం

erar-telugu-c45e2d6c.jpg

వెండితెర పోటుగాళ్ళు : మంచు విష్ణు, రాజ్ తరుణ్, హెభ పటేల్, సోనారిక బడోరియా..   

బాజా భజంత్రీల మోతగాడు : సాయి కార్తీక్   

కాసు దుడ్డు పైసా మనీ మనీ : రామబ్రహ్మం సుంకర    

స్టార్ట్, కెమెరా, యాక్షన్, కట్, షాట్ ఓకే : జి. నాగేశ్వర్ రెడ్డి      

థియేటర్ కి వచ్చిన తేదీ : 2016 - ఏప్రిల్ - 14 

కథ : 

ఎలాంటి లక్ష్యం, ఆశయాలు లేకుండా తమ యవ్వనాన్ని హాయిగా తమకు ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తూ ఉండే కుర్రాళ్ళే మన హీరోలు.. వాళ్ళే అర్జున్ (మంచు విష్ణు), అశ్విన్(రాజ్ తరుణ్). వీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. అలా ఆకతాయిగా తిరిగే వీళ్ళిద్దరూ ఓ పెళ్ళికి వెళ్తారు. అక్కడ అర్జున్ నీలవేణి(సొనారిక బడోరియా)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక అక్కడ నుంచి తనని ప్రేమలో దించే పనిలో భాగంగా అనాధ ని అబద్దం ఆడతాడు. మరోవైపు అదే పెళ్ళిలో సుప్రియ(హేభ పటేల్) అశ్విన్ ని చూసి ప్రేమలో పడుతుంది. కానీ అశ్విన్ నేను పడను అంటారు.. ఫైనల్ గా ఈ రెండు జంటలు ప్రేమలో పడతాయి. ఫైనల్ గా అర్జున్ నీలవేణి వాళ్ళ అన్నయ్య అయిన అభిమన్యు సింగ్ ని పెళ్లి గురించి అడగడానికి వెళ్తే, తను ఒప్పుకోవడమే కాకుండా అప్పటికప్పుడే పెళ్లి కుడా చేసేస్తాడు. అది తన ఫాదర్ నారాయణ(రాజేంద్ర ప్రసాద్)కి చెప్పుకోలేని అర్జున్ నీలవేణి అశ్విన్ వైఫ్ అని ఇంట్లో పెడతాడు. ఆ తర్వాత అదే ఇంట్లోకి అర్జున్ వైఫ్ గా సుప్రియ కుడా వస్తుంది. ఇక అక్కడి నుంచి ఆ కన్ఫ్యూజన్ డ్రామా ఎలా కొనసాగింది.? చివరికి ఈ పెళ్ళాల మార్పిడిపై చిక్కుముడి ఎలా వీడింది? ఫైనల్ గా అశ్విన్, అర్జున్ లు తమ తమ లవర్స్ తో కలిసారా? లేదా? అర్జున్ - అశ్విన్ లు చేసిన మిస్టేక్ ఏంటి? అన్నదే కథ.   

తారామణుల నటనా చాతుర్యం : 

మంచు విష్ణు - రాజ్ తరుణ్ లు తమ తమ పాత్రల్లో లుక్స్ పరంగా చూడటానికి బాగున్నాయి.. ఇక ఒక్కొక్కరి పెర్ఫార్మన్స్ లు ఎలా ఉన్నాయి అనే విషయానికి మంచు విష్ణు ఇలాంటి పాత్రలు ఇది వరకే చేసాడు.. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా సినిమాలలో ఇదే తరహా పాత్రలు చేయడం వలన ఈ  తను పెద్దగా కష్టపడింది, కొత్తగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఏమీ లేవు. కొత్తగా చేసింది ఏంటయ్యా అంటే సగం సీన్స్ లో అవసరానికి మించి, భారీ మోతాదులో ఓవరాక్షన్ చేసారు. దాని వలన ఎబ్బెట్టుగా అనిపించి వచ్చే నవ్వు కూడా ఆగిపోతుంది. సేమ్ టు సేమ్ రాజ్ తరుణ్ కూడా.. తన గత సినిమాల్లో ఇలాంటి మాస్ తరహా పాత్రలు చేసాడు.. కానీ ఈ సినిమాలో తన హీరోయిజంని కాస్త పెంచి చూపించారు. అది పెద్దగా సెట్ కాలేదు.. అలాగే కొన్ని చోట్ల సీన్స్ కి కావాల్సిన దానికన్నా ఎక్కువ డోసేజ్ పెంచి చేయడం వలన తను కూడా పూర్తి స్థాయిలో నవ్వించలేకపోయాడు. నటకిరీటి తన నటనా చాతుర్యంతో కన్ఫ్యూజన్ తో కాస్త కామెడీని పడించగలిగాడు. కానీ ఆయన చేసిన పాత్రని మనం ఇది వరకే చాలా అంటే చాలా తెలుగు సినిమాల్లో చూసేసాం.. కానీ ఆ సినిమాలో బ్రహ్మానందం చేసేవాడు కానీ ఇందులో చేంజ్ కోసం రాజేంద్ర ప్రసాద్ చేసాడు.. అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్.. ఇక హీరోయిన్స్ సోనారిక బడోరియా, హేభ పటేల్ ల విషయానికి వస్తే.. ఇద్దరూ సినిమాకి సూపర్ గ్లామర్ అట్రాక్షన్.. పాటల్లో, సీన్స్ లో ఆ గ్లామర్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా నిర్వర్తించారు. పాటల్లో వీరిద్దరూ ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంటారు. మెయిన్ గా సోనారిక బాగా అందాలను ఆరబోసింది. రాజ్ తరుణ్ - హేభ పటేల్ లవ్ ట్రాక్ 'కుమారి 21F' సినిమాకి కొనసాగింపు అనిపిస్తుంది. హేభ పటేల్ పాత్రని అయితే మక్కిక్కి మక్కి దించేశారు. రవిబాబు, సత్యకృష్ణ, ప్రభాస్ శ్రీను, సుప్రీత్ లు అక్కడక్కడా బాగానే నవ్వించారు.     

సాంకేతిక నిపుణుల ప్రతిభ :

సినిమాటోగ్రఫీ : సిద్దార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉండడమే కాకుండా, నాయి ఎఫెక్ట్స్ సీన్స్ ని కూడా చాలా బాగా షూట్ చేసాడు. 

సంగీతం : సాయి కార్తీక్ అందించిన పాటలు బాగున్నాయి. పిక్చరైజేషన్ పరంగా రిచ్ విజువల్స్, గ్లామర్ కూడా తోడవడంతో చూడటానికి బాగున్నాయి. కానీ అవి వచ్చే సందర్భాలే అంత బాలేవు. ఇక కామెడీ సినిమా కాబట్టి నేపధ్య సంగీతం కూడా దానికి తగ్గట్టే ఉంది. కానీ సమస్య ఏమిటంటే.. కామెడీ బిట్స్ లో వచ్చే కొన్ని ట్యూన్స్ చాలా వరకూ ఇదివరకే వినేసాం. నేపధ్య సంగీతం కోసం పెద్దగా కష్టపడకుండా అదీ ఇదీ మిక్స్ చేసి కొట్టేసాడు. 

ఎడిటింగ్ : ఎంఆర్ వర్మ ఎడిటింగ్ జస్ట్ ఓకే.. ఫస్ట్ హాఫ్ కాస్త పరవాలేధనిపించినా సెకండాఫ్ మాత్రం బాగా సాగదీసి బోర్ కొట్టించేసారు. 

నిర్మాణం :.ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.   

కథనం - దర్శకత్వం : 

ఈ సినిమా పంజాబీ సూపర్ హిట్ ఫిల్మ్ కి రీమేక్. అనగా ఆ కథని యాజిటీజ్ గా తీసుకొని ఇక్కడ హీరో పాత్రలని, నటీనటులని తీసుకోవడంలో డెవలప్ చేశారు. కానీ కథని పట్టించుకోలేదు. ఇలాంటి కన్ఫ్యూజన్ కథ అక్కడ కాస్త కొత్త అనిపించి ఉండచ్చు కానీ ఇక్కడ చేస్తున్నవాటిలో ఎక్కువ అవే ఉన్నాయి కావున కథ చాలా సుత్తిగా అనిపిస్తుంది. ఇకపోతే నాగేశ్వర్ రెడ్డి రాసుకున్న కథనం అస్సలు బాలేదు.. సూటిగా చెప్పాలంటే ఈ సినిమా కథనం, దర్శకత్వం ఆయనలానే 80ల మోడల్ లో ఉంది. మనం 2016 లో ఉంటె ఆయన 1980ల నాటి స్టైల్ లో ఈ సినిమాని రూపొందించాడు. అందుకే ఆడియన్స్ ఎక్కడా సినిమాకి కనెక్ట్ అవ్వలేకపోయారు, నవ్వుకోలేకపోయారు. జి. నాగేశ్వర్ రెడ్డి అంటే థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కాస్తో కూస్తో కామెడీ ఉంటది అని ఆశించి వస్తాడు. కానీ ఆయన మాత్రం నేను ఏది చూపిస్తే అదే కామెడీ అన్న పంథాలో ఓ నాసిరకమయిన కామెడీ సీన్స్ ని అల్లుకుంటూ ఓ బోరింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి తనకు తానే చరమగీతం పాడుకున్నాడు. 

సినిమాలో కూర్చోబెట్టేవి :

- రాజేంద్రప్రసాద్ చేసిన దాన్లో బాగుండే ఓ 5-10నిమిషాల కామెడీ..

సినిమాలో టార్చర్ చేసేవి : 

ఓల్డ్ అండ్ బోరింగ్ కథ
- 1980ల నాటి కథనం
- ఇంకెప్పుడు ముందుకెళ్తుందా అనిపించే కథనం
- వీక్ డైరెక్షన్
- పెద్దగా క్లారిటీ లేని హీరోల పాత్రలు అండ్ అవసరానికి మించిన ఓవరాక్షన్
- ఎంటర్టైన్మెంట్ లేని కామెడీ మూవీ
- ఎడిటింగ్

విశ్లేషణ : 

బయట చూస్తే ఎండ మండే అగ్నిగోళంలా ఉంది. ఈ ఎండ నుంచి తప్పించుకోవడం కోసం సినిమాకి వెళదాం అనుకొని ఈ సినిమాని సెలక్ట్ చేసుకుంటే, బయటకన్నా ఎక్కువగా లోపల మాడిపోతారు. ఇక ఈడోరకం ఆడోరకం అనే సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్. కానీ ఇందులో మహా అయితే మీరు ఒక 10 నిమిషాల పాటు మాత్రమే నవ్వుకోగలరు. మిగతా 2 గంటల పాటు ఎందుకిలా జరుగుతోంది?  ఎందుకు ఇంత పాతగా ఉంది.? ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనేదే లేదు అనే రకరకాల ప్రశ్నలతో సినిమా చూస్తారు. దీని ప్రకారం ఎవ్వరినీ ఏ పరంగానూ సంతృప్తి పరచలేకపోయింది.  ఓవరాల్ గా పాత చితంకాయపచ్చడికి కొత్త రంగులు ఎదో వేసి మార్కెట్ లో సేల్స్ కి పెట్టారు. కానీ మొదటి షోకే ఆ రంగులు వెలిసిపోవడంతో థియేటర్ లోని ఆడియన్స్ ని నవ్వించలేక చతికిలబడిపోయి, ఈ ఏడాది ఫ్లాప్స్ లిస్టులో చోటు దక్కించుకునే దిశగా వెళ్తోంది. సింపుల్ గా ఈ సినిమాని స్కిప్ చేయడం బెటర్.. దానివల్ల మీ మనీ అండ్ టైం సేవ్ అవుతాయి.

పవర్ పంచ్ : 

హిట్ కోసం కథలే లేవన్నట్టు రీమేక్ రీమేక్ అని పాకులాడి, దాన్ని కూడా ఆడియన్స్ కి నచ్చేలా తీయలేక ఫ్లాప్ లిస్టులో చేర్చడానికి తీసినట్టు ఉండే సినిమాలకి ఉదాహరనే ఈ 'ఈడోరకం ఆడోరకం'.    

చూడాలా వద్దా : ఈ ఎండలో ఈ కన్ఫ్యూజన్ టార్చర్ చూడకపోవడమే బెటర్.  

బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ రేంజ్ : ఫ్లాప్

కొస మెరుపు : ఈడోరకం ఆడోరకం - చూసాక మనం మాత్రం 'మెంటల్ రకం' అవుతాం.

చంటిగాడి రేటింగ్ : 1/5

ఇట్లు మీ చంటిగాడు - ఓ తెలుగు సినిమా అభిమాని  

<< Police Telugu Movie Review Live Updates >> Eedo Rakam Aado Rakam Telugu Movie Review Live Updates
Interviews

More

Events

More